పాకిస్థాన్ లో ఓ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేశారు. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని ప్రయాణికుల రైలుపై కాల్పులతో దాడి చేశారు. రైలు ఆగగానే వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. బలూచిస్తాన్ ను స్వతంత్ర ప్రాంతంగా గుర్తించాలన్న డిమాండ్ తో పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ దుశ్చర్యకు పాల్పడింది. క్వెట్టా నుంచి ఖారబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు సుమారు 400 మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తమపై మిలటరీ చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పని, బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లో బలూచిస్తాన్ విస్తీర్ణం పరంగా అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. దేశంలోని 44 శాతం భూభాగం ఈ రాష్ట్ర పరిధిలోకే వస్తుంది. అయితే, దేశంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఇదే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డీప్ సీ పోర్టుల్లో ఒకటైన గ్వాదర్ పోర్టు బలూచిస్తాన్ లోనే ఉంది