హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన భాగ్యనగర వాసులకు వర్షం రాకతో కొంత ఉపశమనం లభించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
ఖైరతాబాద్‌లోని మెర్క్యూరీ హోటల్ వద్ద ఒక కారుపై చెట్టు కూలింది. ఈ సంఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెడదాం ప్రమాదం తప్పింది.
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు బషీర్ బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోఠి, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది.
హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, పాశంమైలారం, పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
భారీ వర్షం పడడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడ, బీర్కూర్, వర్ని, ఇందల్ వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి.
మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
For more related news:https://theshakthi.com/category/categories/trending-news/