ipl

IPL 2025, GT vs MI : చేతులెత్తేసిన ముంబై

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ఈ సీజన్ లో బోణి చేయగా, ముంబై ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయింది.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబై ఛేదనలో చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఛేజింగ్‌కు దిగిన ముంబై మొదటి ఓవర్ నుంచే తడబడింది. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ ఆ తరువాతి బంతికే బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ రికెల్టన్ కూడా 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరినీ సిరాజ్ అవుట్ చేసాడు. అనంతరం తిలక్ వర్మ (39)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (48) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. గుజరాత్ బౌలర్లు ముంబై బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసారు. పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీశారు. దీంతో ముంబై చేయాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు ఓపెనర్లు సాయి సుదర్శన్ (40 బంతుల్లో 63), శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ చూడ చక్కని షాట్లతో ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పవర్ ప్లే లో ఒక్క వికెట్ కూడా పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే మంచి ఆరంభాన్ని శుభ్‌మన్ గిల్ మరోసారి భారీ స్కోరుగా మలచలేకపోయాడు. గిల్ ను హార్దిక్ బోల్తా కొట్టించాడు. మరోవైపు సాయి సుదర్శన్ మాత్రం తన ఫామ్‌ను కొనసాగించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. భారీ స్కోర్ చేస్తుంది అనుకున్న గుజరాత్ కు డెత్ ఓవర్లలో ముంబై షాక్ ఇచ్చింది. బట్లర్, షారుక్, తెవాటియాను తక్కువ పరుగులకే అవుట్ చేసారు. దీంతో గుజరాత్ 200 పరుగుల మార్క్ ను అందుకోలేకపోయింది. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, చాహర్, ముజ్బిర్ రెహ్మాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

అయితే ఐపీఎల్‌లో తొలిసారి ఆడుతున్న తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ముంబై తరఫున గత మ్యాచ్‌లో ఓ ఓవర్‌ వేసి 13 పరుగులే ఇచ్చిన కాకినాడ పేసర్‌ రాజు.. గుజరాత్‌తో పోరులో మూడు ఓవర్లు వేసి ఓ వికెట్‌ (రషీద్‌) పడగొట్టాడు. సత్యనారాయణ రాజు మొదటి వికెట్ తీయగానే కెప్టెన్ హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ అతని దగ్గరికి వెళ్లి అభినందించారు.

Ugadi 2025 ఈ పనులు చేయకండి! : https://youtu.be/Q8JP49cv0RQ

For more sports related news :https://theshakthi.com/category/categories/sports/