ipl

ఐపిఎల్ 2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణి

ఐపిఎల్ 2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఖాతా తెరిచింది. గత సీజన్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ మొదటి మ్యాచ్ లో బెంగళూరు చేతిలో ఓడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తో రెండో మ్యాచ్ లో సునాయాసయంగా గెలిచి ఈ సీజన్ లో మొదటి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో క్వింటన్‌ డికాక్‌ 97 పరుగులతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 151/9 స్కోరు చేసింది. అనంతరం ఛేధనలో కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ఈ సీజన్ లో రాజస్థాన్ వరుసగా రెండో ఓటమిని చూసింది.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ మొదటి ఓవర్ నుంచే తడబడింది. కేకేఆర్ బౌలర్లు క్రమం తప్పకుండ వికెట్లు తీశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు జైస్వాల్‌, సంజూ శాంసన్‌ (13) నిలకడైన ఆరంభాన్నిచ్చారు. కానీ, వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్న శాంసన్‌ను అరోరా అవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ పరాగ్‌, జైస్వాల్‌తో కలసి రెండో వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. పరాగ్‌ మూడు సిక్స్‌లతో జోరు చూపడంతో పవర్‌ప్లేను రాజస్థాన్‌ 54/1తో ముగించింది. అయితే ఆ తరువాత కేకేఆర్ స్పిన్నర్లు మ్యాచ్ ను తిప్పేశారు. మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి రాజస్థాన్ ను ఇబ్బంది పెట్టారు. హసరంగ (4), నితీష్‌ రాణా (8) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే గత మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ జురెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్‌ (16) రెండు సిక్స్‌లు బాదడంతో.. టీమ్‌ స్కోరు కష్టంగా 150 దాటింది.

152 పరుగుల లక్ష్యంతో దిగిన కేకేఆర్ కు డికాక్‌, మొయిన్‌ అలీ శుభారంభం అందించారు. డికాక్ రాజస్థాన్ బౌలర్లపై అటాక్ చేసాడు. రాజస్థాన్ కు ఛాన్స్ ఇవ్వలేదు. మొయిన్ రన్ అవుట్ అవ్వడంతో వచ్చిన కెప్టెన్ రహానె (18)తో కలసి డికాక్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే హసరంగ బౌలింగ్‌లో రహానె అవుట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ డికాక్ మాత్రం స్పీడ్ పెంచాడు. సిక్స్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రఘువంశీ చక్కని సహకారం అందించాడు. 18 బంతుల్లో 17 పరుగులు కావల్సి ఉండగా.. ఆర్చర్‌ బౌలింగ్‌లో డికాక్‌ ఫోర్‌, రెండు సిక్స్‌లతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. కానీ, సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కానీ 97 పరుగులు చేసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

For More related Sports New : https://theshakthi.com/category/categories/sports/