Sports

KKR vs LSG : ఉత్కంఠ పోరులో ఓడిన కేకేఆర్

లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి ఏకంగా 500కు పైగా పరుగులు నమోదయ్యాయి.. ఐపిఎల్ 2025లో మొదటిసారి హోరాహోరీ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 81, నికోలాస్ పూరన్ 87, ఐడెన్ మార్క్రమ్ 47 పరుగులు చేశారు. ఈ సీజన్ లో ఇప్పటికే మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుతున్న పూరన్ మరోసారి ఈడెన్ గార్డెన్స్ లో విధ్వంసం సృష్టించాడు.

అనంతరం, భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలో దిగిన కేకేఆర్ సొంతగడ్డపై జూలు విదిల్చింది. పవర్ ప్లే ముగిసేసరికి 90 పరుగులు చేసారు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. కెప్టెన్ అజింక్యా రహానే 35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు చేయగా వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఓపెనర్ క్వింటన్ డికాక్ (15) మరోసారి నిరాశపర్చినప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకూ సింగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. రింకూ సింగ్ 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 24 పరుగులు అవసరం కాగా, కేకేఆర్ 19 పరుగులే చేసి ఓటమిపాలైంది. రవి బిష్ణోయ్ విసిరిన ఆ ఓవర్లో రింకూ సింగ్ రెండు ఫోర్లు, 1 సిక్స్ కొట్టగా.. హర్షిత్ రాణా ఒక ఫోర్ కొట్టాడు. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో కేకేఆర్ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/