సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ సత్తా చాటుకుంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ సేన 12 పరుగుల తేడాతో నెగ్గింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) మెరుపు ఆటతీరు కనబర్చగా, అటు గెలుపు ఖాయమే అనుకున్న వేళ ముంబై ఇండియన్స్‌ను ఆఖర్లో లఖ్‌నవూ బౌలర్లు దెబ్బతీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీకు ఓపెనర్ మార్ష్ రూపంలో మెరుపు ఆరంభం లభించింది. బాదడమే లక్ష్యంగా సాగిన అతడి ఎదురుదాడికి పవర్‌ప్లేలోనే 69 పరుగులు సమకూరాయి. ఇందులో మార్ష్ ఒక్కడివే 60 పరుగులు కావడం విశేషం.
అశ్వని కుమార్ వేసిన ఆరో ఓవర్‌లో మార్ష్ 6,4,4,4తో 23 పరుగులు రాబట్టాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే స్పిన్నర్ విఘ్నేష్ అతడిని పెవిలియన్‌కు చేర్చడంతో తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఎల్ఎస్‌జీ బ్యాటర్లు రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది.
భారీ ఛేదనలో ముంబై తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు జాక్స్ (5), రికెల్టన్ (10) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్- సూర్యకుమార్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నమన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎల్‌ఎ్‌సజీ బౌలర్లపై ఎదురుదాడి ఆరంభించాడు.
ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీలు బాదేస్తూ స్కోరును చకచకా పెంచాడు. నాలుగో ఓవర్‌లో 6,6,4,4తో 21 రన్స్ రాబట్టాడు. అతడి ధాటికి పవర్‌ప్లేలో స్కోరు 64/2తో ఛేదన దిశగా సాగింది. అటు సూర్య సహకారం అందించడంతో దాదాపు 11 రన్‌రేట్‌తో ఇన్నింగ్స్ సాగింది. అయితే స్పిన్నర్ దిగ్వేష్ తొమ్మిదో ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చి నమన్‌ను బౌల్డ్ చేయగా మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
అనంతరం సూర్య బాధ్యతను తీసుకుని అడపాదడపా బౌండరీలు సాధించాడు. మరో ఎండ్‌లో ఎల్ఎస్‌జీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో తిలక్ వర్మ (25) భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఈ స్థితిలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యను పేసర్ అవేశ్ అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది.
19వ ఓవర్‌లో శార్దూల్ ఏడు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఆరు బంతుల్లో 22 పరుగులకు మారింది. అవేశ్ తొలి బంతిని హార్దిక్ (28 నాటౌట్) సిక్సర్‌గా మలిచినా 9 పరుగులే రావడంతో ముంబై చేసేదేమీ లేకపోయింది.
For more related news : https://theshakthi.com/category/categories/sports/