SRH Vs PBKS : శతక్కొట్టిన అభిషేక్..రికార్డుల వర్షం

SRH Vs PBKS : శతక్కొట్టిన అభిషేక్..రికార్డుల వర్షం

ఐపిఎల్ 2025లో హైదరాబాద్ మొత్తానికి రెండవ విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్ తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది. అభిషేక్ శర్మ సెంచరీతో అదరకొట్టాడు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్, మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ గేమ్ ఆడింది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టని అభిషేక్ శర్మ, ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 106 మీటర్ల సిక్స్ కొత్తగా, ఈ సీజన్ లో ఇదే లాంగెస్ట్ సిక్స్. 10 భారీ సిక్సర్లతో షేక్ ఆడించాడు. ఐపిఎల్ చరిత్రలో ఒక భారత బ్యాటర్ అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం.

246 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ హెడ్ కూడా అర్థ శతకం చేసాడు. వీరిద్దరూ ఉప్పల్ స్టేడియంలో బౌండరీలతో పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపించారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక వచ్చిన క్లాసేన్, కిషన్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు.

అయితే అభిషేక్ శర్మకి ఈ మ్యాచ్ లో లక్ కూడా కలిసి వచ్చింది. పవర్ ప్లే లోనే అవుట్ అవ్వాల్సిన అభిషేక్, నో బాల్ కావడంతో బతికిపోయాడు. కొన్ని క్యాచ్చులు కూడా పంజాబ్ వదిలేయడంతో అభిషేక్ కి కలిసొచ్చింది.

అంతకముందు ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ పరుగులు వెల్లువెత్తించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక, చివర్లో మార్కస్ స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్ మరో హైలైట్ గా నిలిచింది. మహ్మద్ షమీ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో స్టొయినిస్ వరుసగా 4 సిక్సులు కొట్టడం విశేషం. స్టొయినిస్ 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.