SRH

SRH vs RR : విధ్వంసం సృష్టించిన బ్యాటర్లు

ఐపీఎల్2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయంతో శుభారంభం చేసింది. భారీ అంచనాలతో ఐపీఎల్2025లో అడుగుపెట్టిన SRH మొదటి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్ (106 నాటౌట్) అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్ (67), క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) దూకుడుగా ఆడారు. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ భారీ స్కోర్ నమోదు చేసింది.

అయితే ఛేదనలో రాయల్స్ కూడా అస్సలు తగ్గలేదు. మ్యాచ్ ఓడిపోయిన చివరి వరకు పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. సంజు శాంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నంత సేపు రాజస్థాన్ మ్యాచ్ లో ఉంది. వీరిద్దరూ 4వ వికెట్ కు ఏకంగా 111 పరుగులు జోడించి సన్ రైజర్స్ ను భయపెట్టారు. శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 66 పరుగులు చేయగా… జురెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 70 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరూ అవుట్ అవ్వడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. చివర్లో హెట్మెయర్ (23 బంతుల్లో 42), శుభమ్ దూబే (11 బంతుల్లో 34 నాటౌట్) ధాటిగా ఆడారు. దీంతో రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది.

ఐపీఎల్2025లో ఇషాన్ కిషన్ మొదటి సెంచరీ నమోదు చేసాడు. రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ స్కోరులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లండ్ సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్ లు కొట్టడం హైలైట్ గా నిలిచింది.

హ్యాపీగా కావ్యా పాప: ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరగేడంతో కావ్యా ఫుల్ హ్యాపీగా కనిపించింది. నవ్వుతూ సంతోషంలో మునిగిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే చప్పట్లు కొడుతూ సందడి చేసింది. కావ్యా పాప నవ్వు కోసమైనా కప్పు కొట్టాల్సిందేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.