waqf

Wakf Board Amendment Bill : రాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లుకు ఆమోదం

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న వ‌క్ఫ్ (స‌వ‌ర‌ణ‌) బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్య‌తిరేకంగా 95 ఓట్లు వ‌చ్చాయి. కాగా, లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు.. 24 గంట‌ల త‌ర్వాత ఎగువ స‌భ‌లో కూడా ఆమోదం పొంద‌డం విశేషం. సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం రాజ్య‌స‌భ‌లో ఈ బిల్లుకు ఆమోదం ల‌భించింది. ఈ చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. అర్ధరాత్రి వరకూ సభ సాగి.. తర్వాత ఓటింగ్ జరిగింది.

అయితే వక్ఫ్‌ సవరణ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. లోక్‌సభ లో 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. లోక్ సభలో ఆమోదించిన మరుసటి రోజే ఈ బిల్లును రాజ్యసభలో పెట్టారు.

వక్ఫ్ బోర్డుల కూర్పు గురించి వివరిస్తూ… కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వక్ఫ్ బోర్డుల పాలకవర్గాల్లో మహిళా సభ్యులను చేర్చడానికి సంబంధించి ఒక ముఖ్యమైన సంస్కరణను తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.

కేంద్ర వక్ఫ్ మండలిలో 10 మంది సభ్యులు ఉంటారని, అందులో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, నలుగురు వ్యక్తులు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి వంటి జాతీయ స్థాయి ప్రముఖులు ఉంటారని కిరణ్ రిజిజు వివరించారు. రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారని, అందులో ముగ్గురు ముస్లిమేతరులు ఉండవచ్చని, ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/